Mlc Kavitha: సభ జరిగినన్ని రోజులు రైతుల పక్షాన పోరాడతాం 5 d ago
TG : గిరిజన రైతుల గురించి చర్చించాలని చర్చకు పట్టుబడితే సభను వాయిదా వేయడాన్ని తప్పుబడుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. రైతులకు బేడీలు వేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. సభ జరిగినన్ని రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతామన్నారు. శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన నేపథ్యంలో శాసనమండలి బుధవారానికి వాయిదా పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేశారు. శాసనమండలి మీడియా పాయింట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మాట్లాడారు.
రైతుల సమస్యలపై చర్చించాలని అడిగితే సభను వాయిదా వేస్తున్నారన్నారు. కరోనా సమయంలో మా నాయకుడు కేసీఆర్ రైతులను ఎలా ఆదుకున్నారో ప్రజలు గమనించాలన్నారు. గిరిజన రైతుల పక్షాన నిలబడుతాం, వారి సమస్యలు పరిష్కరించేవరకు విడిచిపెట్టమని పేర్కొన్నారు.
రైతును బేడీలు వేసి హాస్పిటల్ కు తెచ్చారని.. ఇది ప్రతి ఒక్కరు ఖండించాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ప్రజాస్వామ్యం మా ఏడో గ్యారెంటీ అన్న కాంగ్రెస్ ఇదేనా మీ ప్రజాస్వామ్యమంటూ ప్రశ్నించారు. రైతుల గురించి మాట్లాడాలి అంటే టూరిజం పాలసీ మీద చర్చ చేస్తారట అంటూ వ్యాఖ్యానించారు. ఇదేనా ప్రజా పాలన? ఇది ప్రజా పాలన కాదు ప్రజా పీడన అంటూ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం కాదు ఇనుపకంచెల రాజ్యం అంటూ శ్రీనివాస్ విమర్శించారు.